tandur district hospital: తాండూరులో కలకలం రేపిన జిల్లా ఆసుపత్రి పేరు మార్పు ఫ్లెక్సీ వ్యవహారం

- తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొడంగల్ ఆసుపత్రిగా ఫ్లెక్సీ ఏర్పాటుతో వివాదం
- ఫ్లెక్సీని చించివేసిన తాండూరు వాసులు
- ఇది కాంట్రాక్టర్ తప్పిదమన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. తాండూరులోని మూడు ప్రవేశ ద్వారాలు ఉండగా, ఒక ప్రవేశ ద్వారానికి సోమవారం రాత్రి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుని ఫ్లెక్సీని చించివేశారు.
విషయంలోకి వెళితే, వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు అయింది. దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కొడంగల్‌లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను అధునికీకరిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్ బృందం కొడంగల్‌కు తనిఖీ నిమిత్తం రానుంది. వారికి చూపించేందుకు తాండూరులోని 200 పగకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.
అయితే ఈ వివాదంపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పందిస్తూ .. కాంట్రాక్టర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందన్నారు. కొడంగల్‌లోని ఆసుపత్రికి కట్టాల్సిన ఫ్లెక్సీని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి పొరబాటున కట్టారని తెలిపారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టాలని, ఆయనకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని అదికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో తాండారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
