HYDRA: అలాంటి గోడలను కూల్చివేస్తాం.. హైడ్రా కీలక ప్రకటన!

- లేఅవుట్ల చుట్టూ గోడలు కడితే కూల్చేస్తామని ప్రకటించిన హైడ్రా
- చుట్టుపక్కల వారికి దారులు మూసేయడం చట్టవిరుద్ధమన్న కమిషనర్ రంగనాథ్
- హైడ్రా ప్రజావాణికి ఇతర ప్రాంతాల బాధితుల నుంచి ఫిర్యాదుల వెల్లువ
చుట్టుపక్కల వారికి దారులు మూసేస్తూ కాలనీల చుట్టూ గోడలు కడితే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. కాలనీ లేఅవుట్ల చుట్టూ గోడలు కట్టుకోవడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. ఇలా ప్రహరీ గోడలు నిర్మించుకోవడానికి అనుమతులు లేవని పేర్కొన్నారు.
ఇటీవల నారపల్లిలోని నల్ల మల్లారెడ్డి లేఅవుట్‌లో 4 కిలోమీటర్ల పొడవునా లేఅవుట్ చుట్టూ నిర్మించిన ప్రహరీని హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఇతర ప్రాంతాల బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 71 ఫిర్యాదులు ప్రజావాణికి అందాయి.
దాంతో వారం నుంచి రెండు వారాల్లో విచారణ పూర్తి చేయాలని కమిషనర్ రంగనాథ్ తన సిబ్బందిని ఆదేశించారు. అల్వాల్‌లోని యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువును కాపాడాలని యాప్రాల్ కుల సంఘాల జేఏసీ ఛైర్మన్ ఆర్. చంద్రశేఖర్ కోరారు. అలాగే తమ ప్లాట్లను నల్ల మల్లారెడ్డి ఆక్రమించారని ఘట్‌కేసర్ మండలం కొర్రెములకి చెందిన ఖాజా మీరన్ మొయినుద్దీన్ ఫిర్యాదు చేశారు.