tdp mp sribharat: లోక్‌సభలో విశాఖ ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు

- గత ప్రభుత్వం మాదిరిగా తాము వ్యవహరించమన్న టీడీపీ ఎంపీ శ్రీభరత్
- గత ప్రభుత్వం ప్రజలను భయపెట్టడమే ఆయుధంగా మార్చుకుని విధ్వంసాలు సృష్టించిందని విమర్శ
- కాకినాడ పోర్టును నాడు బలవంతంగా స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఇచ్చేశారని వ్యాఖ్య
ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలపై లోక్‌సభలో విశాఖపట్నం టీడీపీ ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవహరించినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం చేయదని, అలా వ్యవహరిస్తే ప్రజల తీర్పును అగౌరవ పరిచినట్టు అవుతుందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా తమ కృషి ఉంటుందని పేర్కొన్నారు.
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం జరిగిన చర్చలో శ్రీభరత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రతీకార రాజకీయాలు నడిచాయని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపారని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను భయపెట్టడమే ఆయుధంగా మార్చుకుందని విమర్శించారు.
రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించిందని దుయ్యబట్టారు. బెదిరించి కాకినాడ పోర్టును స్వాధీనం చేసుకుందని, అయితే దానిని ఇటీవల తిరిగి ఇచ్చేశారని అన్నారు. తాను చైర్మన్‌గా ఉన్న యూనివర్శిటీపైనా దాడి చేశారని, తమ పార్టీ శ్రేణులు, అభిమానులను వేధింపులకు గురి చేశారన్నారు. దీనికి ప్రతిగా ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను బలపరిచారన్నారు. దీంతో భయపడిన నాటి ప్రభుత్వం తమ నాయకుడిని అరెస్టు చేసిందన్నారు.
ఆ తీరును నిరసిస్తూ ప్రజలు మార్పునకు పట్టం కట్టారని తెలిపారు. కొంతకాలం కొందరిని మోసం చేయవచ్చేమో గానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీ భరత్ పేర్కొన్నారు.