amberpet boy: అంబర్‌పేట అబ్బాయి, రష్యన్ అమ్మాయి... పెళ్లితో ఒక్కటయ్యారు!

- హైదరాబాద్ అబ్బాయితో రష్యా అమ్మాయి ప్రేమ వివాహం
- నూతన దంపతులను ఆశీర్వదించిన అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
- యూకే అమ్మాయితో తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి
ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు అధికం అవుతున్నాయి. గతంలో కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలు జరుగుతుండేవి. అయితే ఇప్పుడు ఖండాంతరాలు దాటి ప్రేమ వివాహాలు జరుగుతుండటం విశేషం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు పెద్దలు అంగీకరించడంతో విదేశీ యువతులను ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు.
హైదరాబాద్ నల్లకుంట డివిజన్ విజ్ఞాన్‌పురి కాలనీకి చెందిన చలమలశెట్టి వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు అవినాష్ కార్తీక్, రష్యాకు చెందిన యాన్న ప్రేమించుకున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో హైదరాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ జంటను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సోమవారం కలిసి అభినందనలు తెలిపారు.
అలాగే ఇటీవల హైదరాబాద్‌లో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన రాజీవ్ రెడ్డికి యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన యువతి లారెన్ ఫిషర్‌తో వివాహం జరిగింది. రాజీవ్ రెడ్డి మాంచెస్టర్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తుండగా, అక్కడ పోలీస్ శాఖలో పని చేస్తున్న లారెన్ ఫిషర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని వారి పెద్దలకు తెలియజేయగా, ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.
రష్యా అమ్మాయితో హైదరాబాద్ అబ్బాయి వివాహం, అంతకు ముందు యూకే అమ్మాయితో తెలంగాణ అబ్బాయి ప్రేమ వివాహాం జరగడం విశేషం. ఇలా ఖండాంతరాలు దాటి జరుగుతున్న ప్రేమ వివాహాలు వార్తల్లో నిలుస్తున్నాయి.
