Gold Rates: కొనసాగుతున్న పసిడి పరుగు.. రూ. 85 వేలు దాటేసిన పుత్తడి ధర

Gold rates crossed Rs 85 thousand mark

  • అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా ధరల్లో పెరుగుదల
  • నిన్న ఒక్క రోజే 10 గ్రాముల పసిడిపై రూ. 400 పెరుగుదల
  • కిలో వెండిపై రూ. 300 పెరిగి రూ. 96 వేలకు చేరిక
  • బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో బంగారం ధరల పరుగు కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 85,300కు ఎగబాకింది.  99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ. 400 పెరిగి రూ. 84,900కు చేరుకుంది. 

మరోవైపు, వెండి ధర కూడా కిలోకు రూ.300 లాభపడి రూ. 96 వేలకు చేరుకుంది. ఎంసీఎక్స్ ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ నెల బంగారం కాంట్రాక్టుల ధర 10 గ్రాములకు రూ. 461 పెరిగి రూ. 82,765కు పెరగ్గా, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం ఔన్సుకు 7.5 డాలర్ల మేర క్షీణించి 2,827 డాలర్లుగా నమోదైంది.

కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్ విధింపు మన రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా చర్యలు వాణిజ్య యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 49 పైసలు క్షీణించింది. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.11గా నమోదైంది. అమెరికా డాలరు బలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగా ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News