jaya bachchan: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై జయాబచ్చన్ సంచలన ఆరోపణలు

- ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ ఎంపీ జయా బచ్చన్
- తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారంటూ ఆరోపణ
- సామాన్య ప్రజల కోసం కుంభమేళాలో యోగి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదంటూ విమర్శ
గత నెలలో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ, అమితాబ్ బచ్చన్ అర్ధాంగి జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని ఆరోపించారు. దీనితో కుంభమేళా నీరు కలుషితమైందని విమర్శించారు.
పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆమె ధ్వజమెత్తారు. సామాన్య ప్రజల కోసం కుంభమేళాలో ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆమె విమర్శించారు.
మరోవైపు, కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సహా ప్రతిపక్ష నేతలు పార్లమెంటులో విమర్శలు గుప్పించారు. కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి వాస్తవ సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు.