Home Ministry: ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సూచన

Union Home secretary suggestion to AP and Telangana

  • విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ
  • ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచన
  • నిధుల పంపకాల విషయంలో పట్టుబట్టవద్దన్న కేంద్ర హోంశాఖ

ఉభయ తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అంశాలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.

విభజన జరిగి పదేళ్లు దాటినా పలు అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈరోజు జరిగిన సమావేశంలో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా హోంశాఖ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇరు రాష్ట్రాలు సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేసింది. నిధుల పంపకాల విషయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, ఎక్కువ కావాలని పట్టుబడితే రెండు రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.

9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో న్యాయ సలహాలతో ముందుకు వెళ్లాలని హోంశాఖ సూచించింది. పలు అంశాలపై తదుపరి సమావేశంలో ఒక నిర్ణయానికి వద్దామని హోంశాఖ తెలుగు రాష్ట్రాల అధికారులకు తెలిపింది.

  • Loading...

More Telugu News