Union Minister: సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తాం: రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

- తెలంగాణ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామన్న కేంద్రమంత్రి
- కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్న కేంద్రమంత్రి
- 2026 లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామన్న అశ్వినీ వైష్ణవ్
సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ నుండి మరిన్ని వందే భారత్ రైళ్లను నడుపుతామని తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
తెలంగాణలో 1,026 కిలోమీటర్ల మేరకు కవచ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2026 నాటికి దేశమంతటా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని ఆయన తెలియజేశారు. పేదల కోసం తాము నమో భారత్ రైళ్లను నడుపుతున్నామని, త్వరలో దేశమంతటా దాదాపు వంద నమో భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.