Telangana: తెలంగాణలో ఏ సామాజిక వర్గం ఎంత ఉందంటే?

- రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీ జనాభా 10.08 శాతం
- ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం
- ఓసీ జనాభా 13.21 శాతం, ముస్లిం ఓసీ జనాభా 2.48 శాతం
తెలంగాణ రాష్ట్రంలో ఏయే సామాజిక వర్గాలు ఎంత శాతం ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వెల్లడైంది. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న బీసీ ఉప సంఘానికి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి సర్వే నివేదికను అందజేశారు.
సర్వేలో 96.9 శాతం మంది లేదా 3.54 కోట్ల మంది పాల్గొన్నారు. 3.1 శాతం మంది లేదా 16 లక్షల మంది సర్వేకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నారు.
ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతంగా ఉంది. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నారు.
సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం, తెలంగాణలో మొత్తం 1,15,79,457 కుటుంబాలు ఉన్నాయి. ఈ సర్వేలో 1,12,15,134 (96.4 శాతం) కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వేకు దూరంగా 3,64,323 (3.1 శాతం) కుటుంబాలు ఉన్నాయి. సర్వేలో 3,54,77,554 కోట్ల జనాభా పాల్గొంది. సర్వేకు దూరంగా 16,00,000 మంది ఉన్నారు.
జనాభాలో పురుషులు 1,79,21,183 (50.51 శాతం) మంది, మహిళలు 1,75,42,597 (49.45 శాతం) మంది ఉండగా, థర్డ్ జెండర్ 13,774 (0.04 శాతం) మంది ఉన్నారు.
సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ జనాభా 1,64,09,179 (46.25 శాతం), ఎస్సీ 61,84,319 (17.43 శాతం), ఎస్టీ 37,05,929 (10.45 శాతం), ఓసీ 47,21,115 (13.21 శాతం), ముస్లిం బీసీ 35,76,588 (10.08 శాతం), ముస్లిం ఓసీ జనాభా 8,80,424 (2.48 శాతం) ఉన్నారు.