Manda Krishna Madiga: మా మూలాలు కాపాడుకోవడానికే సాంస్కృతిక కార్యక్రమం: మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga on Laksha Dabbulu veyi gonthukalu

  • ముప్పై ఏళ్ళ ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని వ్యాఖ్య
  • చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్న మంద కృష్ణ
  • లక్ష డప్పులు - వేయి గొంతుకల కార్యక్రమానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి

తమ మూలాలను కాపాడుకోవడానికి త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం 1994లో ప్రారంభించామని, 1996లో మొదటి బహిరంగ సభను నిర్వహించామన్నారు. ముప్పై ఏళ్లలో ఎన్నో ఆందోళనలు, సభలు నిర్వహించినప్పటికీ ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యమం 1994లో ప్రారంభమైనప్పటికీ, మొదటి రెండేళ్లు ఉద్యమ విస్తరణ కోసం పనిచేశామని ఆయన అన్నారు. వర్గీకరణ కోసం హైదరాబాద్‌లో ఎన్నో ఆందోళనలు నిర్వహించామని, లక్షల మందిని సమీకరించామని, ఎప్పుడూ సమస్య రాలేదని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఉంటే ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఇన్నేళ్లు నిలబడి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. తమ అస్తిత్వం కోసం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయని ఆయన అన్నారు. తమ మూలాలను కాపాడుకునేందుకే లక్ష డప్పులు-వెయ్యి గొంతుకల సాంస్కృతిక కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఆరు అంశాలను కారణంగా చూపుతూ తమ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తూ నోటీసు ఇచ్చారని, ఇది అన్యాయమని ఆయన అన్నారు. వారు పేర్కొన్న అంశాలకు సమాధానం ఇస్తూ మరో వినతిపత్రం ఇస్తామని ఆయన చెప్పారు. తాము మాత్రం గాంధేయ మార్గంలోనే ప్రయాణం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గిన్నిస్ బుక్కులో చోటు దక్కేలా తమ కార్యక్రమం ఉండబోతుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News