Abhishek Sharma: అభిషేక్ శర్మ రికార్డ్ బ్రేకింగ్ కొట్టుడు... మెంటార్ యువరాజ్ సింగ్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!

After Abhishek Sharmas Record Breaking Knock Mentor Yuvraj Singhs Post Wins Internet

  • ఐదో టీ20లో అభిషేక్ స్వైర విహారం
  • భారీ శ‌త‌కం తోడు రెండు వికెట్లు తీసిన యంగ్ ప్లేయ‌ర్‌
  • అత్యుత్తమ ప్రదర్శనతో ఆక‌ట్టుకున్న అభిని మెచ్చుకున్న‌ మెంటార్ యువీ
  • 'ఎక్స్' వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు.. నెటిజ‌న్ల కామెంట్స్‌

ముంబ‌యిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐదో టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విజ‌యంలో అభిషేక్ శర్మ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కీల‌క పాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో అభిషేక్ కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేయ‌గా, బౌలింగ్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అది కూడా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయ‌డం విశేషం. అలాగే ఒక క్యాచ్ కూడా ప‌ట్టాడు. 

ఇలా ఓవరాల్‌గా ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో మ‌నోడు మ్యాచ్‌ను ఏక‌ప‌క్షంగా మార్చేశాడు. దీంతో అత్యుత్తమ ప్రదర్శనతో ఆక‌ట్టుకున్న అభిని అతడి మెంటార్, భార‌త లెజెండరీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మెచ్చుకున్నాడు. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేక‌ పోస్ట్ చేశాడు.  

"అభిషేక్ శర్మ బాగా ఆడావు. నేను నిన్ను ఎక్కడ చూడాలనుకున్నానో ఇప్పుడు నీవు అక్క‌డ ఉన్నావు. నీ గురించి గర్వపడుతున్నాను" అని యువరాజ్ త‌న‌ పోస్టులో రాసుకొచ్చాడు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 'గురువుకు త‌గ్గ శిష్యుడు' అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతకుముందు అభిషేక్ శ‌ర్మ ఇదే సిరీస్ తొలి మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసినప్పుడు కూడా యువీ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

"సిరీస్ లో కుర్రాళ్లకు శుభారంభం! మన బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. సర్ అభిషేక్ శర్మ, టాప్ నాక్ (అదరగొట్టేశావు)!! నువ్వు గ్రౌండ్ లో కొట్టిన రెండు బౌండరీలు నన్ను ఆకట్టుకున్నాయి" అని యువరాజ్ పోస్ట్ చేశాడు.

ఇక నిన్న‌టి మ్యాచ్‌లో 24 ఏళ్ల అభిషేక్ స్వైర విహారం చేశాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఆపై కేవలం 37 బంతుల్లోనే అద్భుతమైన శతకం న‌మోదు చేశాడు. అభి తుపాను ఇన్నింగ్స్ కార‌ణంగా భారత్ 20 ఓవర్లలో 247/9 భారీ స్కోరును నమోదు చేసింది. 

ఆ త‌ర్వాత‌ ఇంగ్లండ్‌ను కేవలం 97 పరుగులకే కట్టడి చేసి, ఏకంగా 150 ప‌రుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ సాధించింది. అలాగే ఈ విజయంతో భారత్ 4-1తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

More Telugu News