Fire in plane: రన్ వే పై విమానంలో మంటలు.. వీడియో ఇదిగో!

Plane Catches Fire On Runway Fliers Scream Please Get Us Out

  • విండోలో నుంచి మంటలు గమనించి ప్రయాణికుల కేకలు
  • అమెరికాలో తప్పిన విమాన ప్రమాదం
  • ప్రయాణికులను దింపేసి మంటలు ఆర్పిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది

రన్ వే పై బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో మంటలు చెలరేగాయి.. విమానం రెక్క ప్రాంతంలో పొగ, మంటలను గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. అమెరికాలోని హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతుండడంపై ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
 
ఆదివారం హ్యూస్టన్ లోని జార్జి బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఆ విమానంలో ప్రయాణికులు అందరూ ఎక్కారు. పైలట్లు టేకాఫ్ కు సిద్ధమవుతుండగా విమానం రెక్క ప్రాంతంలో పొగ, మంటలు ఎగిసిపడడం ప్రయాణికులు గమనించారు. ఓ ప్రయాణికురాలు మంటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఓ ప్రయాణికురాలు తనను దింపేయాలంటూ విమానంలోని సిబ్బందిని ప్రాధేయపడడం వినిపించింది. కాగా, మంటలను గుర్తించాక విమానంలోని ప్రయాణికులను దింపేసి ఫైర్ సిబ్బంది సాయంతో మంటలు ఆర్పేశామని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయం అధికారులు తెలిపారు.

అమెరికాలో ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాషింగ్టన్ డీసీలో ప్రయాణికుల విమానాన్ని హెలికాప్టర్ ఢీ కొనడంతో మొత్తం 67 మంది చనిపోయిన విషయం తెలిసిందే. గత శుక్రవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని ఓ షాపింగ్ మాల్ పై విమానం కూలి ఏడుగురు చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. తాజాగా హ్యూస్టన్ విమానాశ్రయంలో టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News