Jos Buttler: అభిషేక్ విధ్వంసం.. తాను చూసిన బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ ఇదేనంటూ ఇంగ్లండ్ కెప్టెన్ కితాబు!

- ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో అభిషేక్ శర్మ ఊచకోత
- కేవలం 54 బంతుల్లోనే 135 రన్స్ చేసిన యువ ఓపెనర్
- సెంచరీతో అదరగొట్టిన అభిషేక్‌పై జోస్ బట్లర్ ప్రశంసలు
ముంబయిలోని వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన శతకంతో అదరగొట్టిన విషయం తెలిసిందే. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు చేసి, ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్సర్లు నమోదు కావడం విశేషం. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం 248 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం 97 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఫిల్ సాల్ట్ మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. కేవలం 23 బంతుల్లో 55 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో టీమిండియా ఏకంగా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో భారత్ 5 టీ20ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.
కాగా, 135 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించాడు. తాను ఇప్పటివరకు ఎంతో క్రికెట్ చూశానని, అయితే అభిషేక్ హిట్టింగ్ తాను చూసిన ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాడు. "నేను చాలా క్రికెట్ చూశాను. కానీ, ఈరోజు అభిషేక్ ఇన్నింగ్స్ అత్యుత్తమం" అని జోస్ బట్లర్ పేర్కొన్నాడు.
"సిరీస్‌లో ఓడిపోయినందుకు నిరాశగా ఉంది. కానీ మేము కొన్ని విషయాలలో బాగా పెర్ఫామ్ చేశాం. కొన్ని విషయాలలో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. హోం సిరీస్‌లలో భారత్ అద్భుతమైన జట్టు. సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తాం" అని ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ తెలిపాడు.