Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన జీపు.. 9 మంది దుర్మరణం

Nine Killed and Three Missing After Haryana Cruiser Plunges Into Canal

  • హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో ఘటన
  • మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక
  • ఇద్దరిని రక్షించిన సహాయక సిబ్బంది 

వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జీపు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరిని రక్షించారు. హరియాణాలోని ఫతేహాబాద్‌ జిల్లా సర్దారేవాలాలో జరిగిందీ ఘటన. 

పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో జరిగిన పెళ్లికి హాజరైన 14 మంది తిరిగి శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో సర్దారేవాలా గ్రామం వద్ద జీపు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దారి కనిపించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. 9 మంది మృతదేహాలను వెలికి తీశారు. మృతులందరూ బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

More Telugu News