Crime News: యువతిని వీడియో తీసిన వ్యక్తి నిర్బంధం.. తల్లిదండ్రులు వచ్చేసరికి ఆత్మహత్య

- విశాఖ ఫార్మా సిటీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువకుడు
- యువకుడుని గదిలో నిర్బంధించి తల్లిదండ్రులకు కబురు
- గదిలో కేబుల్ వైరుతో ఉరివేసుకున్న వైనం
- ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
యువతిని వీడియో తీసిన ఓ వ్యక్తి అంతలోనే శవమయ్యాడు. విశాఖపట్నం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన గొందేటి భాస్కరరావు (30) విశాఖపట్నం ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్. గాజువాక సమీపంలోని శ్రీరాంనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. నిన్న ఉదయం పక్కింటి అమ్మాయిని వీడియో తీశాడు. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు భాస్కరరావుతో గొడవకు దిగారు. వీడియోను డిలీట్ చేయించారు.
అయితే, అక్కడితో ఆగకుండా భాస్కరరావును ఇంట్లో నిర్బంధించి విజయనగరంలోని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి చూసి హతాశులయ్యారు. సీలింగ్‌కు కేబుల్ వైరుతో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. భాస్కరరావు ముఖంపై గాయాలు ఉన్నాయని, తమ కుమారుడిని కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.