Vijayasai Reddy: వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

- ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి
- మూడు రోజుల క్రితం షర్మిల ఇంటికి వెళ్లి ఆమెతో మూడు గంటలపాటు సమావేశం
- రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన విజయసాయిరెడ్డి మరో సంచలనానికి కారణమయ్యారు. మూడు రోజుల క్రితం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ షర్మిల నివాసానికి వెళ్లి దాదాపు మూడు గంటలపాటు ఆమెతో సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించినట్టు తెలిసింది. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేశారని సమాచారం. జగన్‌కు, షర్మిలకు మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో మరోమారు తీవ్ర చర్చనీయాంశమైంది.
విజయసాయి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించినప్పుడు షర్మిల ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలోనూ పలుమార్లు ఆయనపై విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇకనైనా నిజాలు బయటపెట్టాలని సూచించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి పార్టీని వీడారని విమర్శించారు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.