Revanth Reddy: కేంద్ర బడ్జెట్... కమాండ్ కంట్రోల్ రూంలో రేవంత్ రెడ్డి కీలక భేటీ

- భేటీలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఆర్థిక శాఖ అదికారులు
- కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందేమిటి? ఇచ్చిందేమిటంటూ ముఖ్యమంత్రి అసంతృప్తి
- బడ్జెట్‌పై శ్రీధర్ బాబు అసహనం
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మేం ఏం అడిగాం... మీరు ఇచ్చింది ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ, ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై వారు చర్చించారు.
బడ్జెట్‌పై శ్రీధర్ బాబు
దేశ జీడీపీలో ఎక్కువ భాగం తెలంగాణదే అయినప్పటికీ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల వాటా తప్పనిసరిగా రావాలని ఆయన అన్నారు. పక్క రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు నిధులు ఎందుకు ఇచ్చారనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో కలగకుండా ఉండాలంటే, ఇక్కడి బీజేపీ నాయకులు నిధులు తీసుకురావాలని ఆయన అన్నారు.