Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్లో ఏపీని దారుణమైన రీతిలో విస్మరించారు: జైరాం రమేశ్

- నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జైరాం రమేశ్
- బీహార్ లో ఎన్నికలు ఉండడంతో వరాలు ప్రకటించారని ఆరోపణ
- ఏపీని ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్న
కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఎన్నికలు ఉన్నందునే బీహార్ కు భారీ బొనాంజా ప్రకటించారని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణమైన రీతిలో విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.
బీహార్ కు భారీ ఎత్తున వరాలు ప్రకటించడం ఆశ్చర్యమేమీ కలిగించలేదని, ఈ ఏడాది బీహార్ లో ఎన్నికలు జరగనుండడమే అందుకు కారణమని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి బీహార్, ఏపీ వెన్నుదన్నుగా ఉన్నాయని... కానీ బీహార్ కు భారీ కేటాయింపులు చేసి, ఏపీ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు... ఎందుకని? అని జైరాం రమేశ్ సూటిగా ప్రశ్నించారు.
అంతేకాదు, వార్షిక బడ్జెట్ ను రూపొందించిన విధానంపైనా ఆయన విమర్శలు చేశారు. "ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు రంగాల్లో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. అవి 1. వాస్తవ వేతనాల స్తంభన 2. సామూహిక వినియోగంలో సరళత్వం లోపించడం 3. ప్రైవేట్ రంగంలో మందగించిన పెట్టుబడుల రేటు 4. సంక్లిష్టమైన సమస్యాత్మక జీఎస్టీ విధానం. ఈ రుగ్మతలను నయం చేయడానికి నేడు ప్రకటించిన బడ్జెట్ ఏమాత్రం సరైనది కాదు. కేవలం ఆదాయపన్ను చెల్లింపుదారులకే ఈ బడ్జెట్ తో ఊరట లభించింది. ఈ బడ్జెట్ తో ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి" అని జైరాం రమేశ్ వివరించారు.