Udit Narayan: మ‌హిళా అభిమానుల‌కు ముద్దులు... వివాదంపై స్పందించిన ప్ర‌ముఖ‌ గాయ‌కుడు!

Udit Narayan Breaks Silence After Being Trolled for Kissing Female Fans

  • లైవ్‌ మ్యూజిక్ క‌న్స‌ర్ట్ లో మ‌హిళా అభిమానుల‌కు సింగ‌ర్‌ ముద్దులు 
  • నెట్టింట వీడియో వైర‌ల్.. గాయ‌కుడి తీరుపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం
  • ముద్దుల‌ వివాదంపై ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉదిత్ వివ‌ర‌ణ‌

ప్ర‌ముఖ గాయ‌కుడు ఉదిత్ నారాయణ్ మ‌హిళా అభిమానుల‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన వీడియో నెట్టింట‌ వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. ముంబ‌యిలో జ‌రిగిన ఓ క‌న్స‌ర్ట్‌లో ఈ సీనియ‌ర్ సింగ‌ర్ త‌న‌తో సెల్ఫీలు దిగిన మ‌హిళా అభిమానుల‌కు ముద్దులు పెట్టారు. సెల్ఫీలు ఇస్తూ మ‌హిళా ఫ్యాన్స్‌ను కిస్ చేయ‌డం వీడియోలో ఉంది. 

ఈ క‌న్స‌ర్ట్ తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డం, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయ‌న‌ ఇబ్బందుల్లో పడ్డారు. మ‌హిళా అభిమానుల‌తో ఉదిత్ నారాయణ్ ప్ర‌వ‌ర్తించిన‌ తీరుపై నెటిజన్లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై ఆయ‌న ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. 

ఫ్యాన్స్‌పై త‌న‌కున్న అభిమానాన్ని తెలియ‌జేయ‌డానికే తాను అలా చేశాన‌న్నారు. త‌న‌కు వేరే ఉద్దేశం లేద‌ని తెలిపారు. కొంద‌రు కావాల‌నే దీనిని వివాదంగా చూస్తున్నార‌ని ఉదిత్ నారాయ‌ణ్ చెప్పుకొచ్చారు. 

"అభిమానుల‌కు నేనంటే చాలా ఇష్టం. కొంత‌మంది క‌ర‌చాల‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, మ‌రికొంత మంది కిస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అదంతా కేవ‌లం ఆత్మీయ‌త‌తో కూడుకున్న విష‌య‌ం. స‌మాజంలో ఎంతో పేరు, మ‌ర్యాద క‌లిగిన వ్య‌క్తిని నేను. అభిమానుల‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించే ఉద్దేశం నాకు లేదు. వివాదాల‌కు దూరంగా ఉంటాను. కొంత‌మంది కావాల‌నే దీన్ని వివాదంగా చూస్తున్నారు" అని ఉదిత్ నారాయణ్ అన్నారు.  

కాగా, తెలుగులో కూడా ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్ పాడారాయన‌. అయితే, కొన్నిరోజుల క్రితం ముంబ‌యిలో ఉదిత్ లైవ్‌ క‌న్స‌ర్ట్ నిర్వ‌హించారు. ఇందులో త‌న ఒక‌ప్ప‌టి చాట్ బ‌స్ట‌ర్స్‌ పాట‌ల‌ను ఆల‌పించారు. ఈ క్ర‌మంలో 'మొహ్రా' మూవీలోని 'టిప్ టిప్ బర్సా పానీ' అనే పాట‌ను పాడారు. 

ఆ స‌మ‌యంలో ఆయ‌న‌తో సెల్ఫీలు తీసుకోవడానికి మ‌హిళా అభిమానులు వేదికకు దగ్గరకు వెళ్లారు. ఆయ‌న‌ వేదికపై పాట పాడుతూనే వారి దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగారు. ఈ క్ర‌మంలోనే ఉదిత్ నారాయణ్ ముగ్గురు మహిళా అభిమానుల బుగ్గలపై ముద్దు పెట్టారు. 

ఆయ‌న అలా ఒక్క‌సారిగా ముద్దులు పెట్ట‌డంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అంత‌టితో ఆగ‌కుండా ఓ అభిమాని పెదవులపై కూడా ఆయ‌న‌ ముద్దు పెట్టారు. ఈ క‌న్స‌ర్ట్ తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఆయ‌న‌ ఇబ్బందుల్లో పడ్డారు.

More Telugu News