Virat Kohli: కోహ్లీ కోసం మైదానంలోకి దూసుకొచ్చిన అభిమానులు.. ఇదిగో వీడియో!

Three Fans Invaded Together to Meet Virat Kohli at Arun Jaitley Stadium Video goes Viral

  • అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, రైల్వేస్ జ‌ట్ల మ‌ధ్య రంజీ మ్యాచ్
  • దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత ఈ మ్యాచ్ ద్వారా రంజీ బ‌రిలోకి దిగిన విరాట్‌ 
  • ఈరోజు మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకు వ‌చ్చిన ముగ్గురు ఫ్యాన్స్ 
  • ఈ మ్యాచ్‌లో రైల్వేస్‌ను ఇన్నింగ్స్ 19 ప‌రుగుల తేడాతో ఓడించిన ఢిల్లీ

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, రైల్వేస్ జ‌ట్ల మ‌ధ్య రంజీ మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ రంజీ బ‌రిలోకి దిగాడు. దీంతో అత‌ని కోసం స్టేడియానికి అభిమానులు భారీగా క్యూక‌ట్టారు. అయితే, నిన్న‌ బ్యాటింగ్‌కు దిగిన ర‌న్‌మెషీన్ త్వ‌ర‌గా ఔట్ కావ‌డంతో వారు నిరాశ‌తో వెనుదిరిగారు. 

అయితే, ఈరోజు రైల్వేస్ జ‌ట్టు బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ వ‌ద్ద‌కు ముగ్గురు అభిమానులు ప‌రిగెత్తుకు వ‌చ్చారు. వారంతా కోహ్లీ పాదాల‌కు న‌మ‌స్క‌రించేందుకు ప్ర‌య‌త్నించ‌గా అప్ప‌టికే మైదానంలోకి చేరుకున్న‌ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంత‌రం వారిని స్టేడియం బ‌య‌ట‌కు తీసుకువెళ్లారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. మొన్న కూడా ఓ అభిమాని ఇలాగే కోహ్లీ కోసం భ‌ద్ర‌తా సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి మైదానంలో ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. 

ఇక ఈ మ్యాచ్‌లో రైల్వేస్ జ‌ట్టుపై ఢిల్లీ ఘ‌న విజ‌యం సాధించింది. ఇన్నింగ్స్ 19 ప‌రుగుల తేడాతో ఓడించింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ లో 241 ప‌రుగులు చేయ‌గా.. ఢిల్లీ జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్ లో 374 ర‌న్స్ చేసింది. దీంతో 143 ప‌రుగుల లీడ్ ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రైల్వేస్ కేవ‌లం 114 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 19 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

More Telugu News