Somireddy Chandramohan Reddy: ఆందోళనలు చేయాల్సింది మా వాళ్లే: సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

- విద్యావ్యవస్థను విధ్వంసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారన్న సోమిరెడ్డి
- వైసీపీ పాలనలో విద్యా రంగాన్ని ఎంత దిగజార్చారో అసర్ నివేదిక చెబుతోందన్న సోమిరెడ్డి
- పింక్ డైమండ్ అని కూసిన రోజే విజయసాయిరెడ్డిని ఎత్తి బొక్కలో వేయాల్సిందన్న సోమిరెడ్డి
- పుంగనూరు నుంచి విశాఖ వరకూ ఎక్కడ చూసినా అక్రమాలు, అరాచకాలేనని సోమిరెడ్డి ఆరోపణ
ఈ నెల 5వ తేదీన వైసీపీ ధర్నాకు పిలుపునివ్వడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు చేయాల్సింది వాళ్లు (వైసీపీ) కాదని, వ్యవస్థలను సర్వనాశనం చేసిన వైసీపీ సర్కారు పాపాలపై ధర్నాలు చేయాల్సింది తామేనని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన వైసీపీ ధర్నాల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులకు బకాయిలు పెట్టి పోయి ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారని ప్రశ్నించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి అసర్ (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదిక వైసీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి అద్దం పడుతోందని అన్నారు. నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యావ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నారన్నారు.
ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఏ1, ఏ2లతో పాటు అంతా తామై వ్యవహరించిన ఆ నలుగురిలో ఎవరిపైనా చర్యలు లేవని మా వాళ్లు (టీడీపీ) ధర్నా చేయాలంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇంకా తెర వెనుక నుంచి వాళ్లే పెత్తనం చేస్తున్నారని వస్తున్న వార్తలు చూసి మా కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారన్నారు. వైసీపీ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారి పాపాలకు ఫలితం అనుభవించేలా శిక్షలు పడాలని మేమే రోడ్డెక్కాలన్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు పెరట్లో పింక్ డైమండ్ ఉందని చెప్పిన రోజే విజయసాయిరెడ్డి కాలర్ పట్టుకుని ఎత్తి బొక్కలో వేసుండాల్సిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి పింక్ డైమండ్ అనేదే లేదని జగన్ రెడ్డి సొంత మనిషి ధర్మారెడ్డి ప్రకటించారని అన్నారు.
వైసీపీ పాలనలో చంద్రబాబు నుంచి కార్యకర్త వరకు నరకం అనుభవించారన్నారు. ల్యాండ్ రికార్డులు ఇష్టారాజ్యంగా మార్చేయడంతో ప్రతి ఒక్కరూ బాధితులుగా మిగిలారని పేర్కొన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి నుంచి విశాఖలో విజయసాయిరెడ్డి వరకు ఎక్కడ చూసినా భూదందాలే జరిగాయని ఆరోపించారు. అధికారంలో ఎవరైనా ఉండొచ్చు.. ప్రజల సొత్తును కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. కానీ వాళ్లే అక్రమాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మైనింగ్, రెవెన్యూ తదితర కీలకశాఖల్లో బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చి దోపిడీకి పాల్పడిన వారు రక్షించబడుతుండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ1, ఏ2 నుంచి ఆ నలుగురితో పాటు వైసీపీ ఐదేళ్ల పాలనలో దోపిడీలు, దుర్మార్గాలు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని సోమిరెడ్డి అన్నారు.