Kethireddy Venkatarami Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి.. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు రెండూ తప్పే: వైసీపీ నేత కేతిరెడ్డి

- ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే
- వారు ఎంత తిడుతున్నా చంద్రబాబు ఓపిగ్గా ఉన్నారన్న కేతిరెడ్డి
- అధిష్ఠానం దీనిని ఖండించి ఉంటే బాగుండేదన్న నేత
- జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా చేసి ఉంటారన్న కేతిరెడ్డి
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను తాజాగా ఆ పార్టీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఖండించారు. ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనని అంగీకరించారు. దాడులకు పాల్పడటం మంచిపద్ధతి కాదని పేర్కొన్నారు. తాడిపత్రిలో తన చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపైకి వెళ్లినప్పుడు కూడా తప్పేనని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు వెళ్లడం ద్వారా ఓ తప్పుడు విధానాన్ని నేర్పిస్తున్నట్టు అవుతుందని చెప్పారు. ఈ దాడులు పార్టీ నిర్ణయమని తాను అనుకోవడం లేదని, జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే వారు ఈ దాడులకు పాల్పడి ఉంటారని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు.
భువనేశ్వరిపై పార్టీ నేతలు నిజంగానే అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే, అది తప్పని అధిష్ఠానం చెప్పి ఉంటే బాగుండేదని కేతిరెడ్డి పేర్కొన్నారు. అలా చెప్పలేదు కాబట్టే, చంద్రబాబును రాక్షసుల్లా హింసిస్తున్నారని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారని అన్నారు. అయితే, వారు ఎంత తిడుతున్నా, అవహేళనకు గురిచేసినా చంద్రబాబు మాత్రం చాలా ఓపిగ్గా ఉన్నారని, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్‌ను అనవసరంగా తిట్టడం వారిద్దరూ ఏకం కావడానికి ఉపయోగపడిందని కేతిరెడ్డి వివరించారు.