Atchannaidu: ఈసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నాం... డేట్లు ఫిక్స్ చేశాం: అచ్చెన్నాయుడు

atchannaidu media conference

  • చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
  • కడపలో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణకు పొలిట్ బ్యూరో నిర్ణయం
  • మే 27,28 తేదీల్లో తీర్మానాలు ..29న మహానాడు బహిరంగ సభ నిర్వహిస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు. 

ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు తేదీలను ఖరారు చేసినట్లు చెప్పారు. మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకుంటామని వెల్లడించారు. 

వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించామని తెలిపారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులను నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం .. భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. 
 
స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన పది శాతం రిజర్వేషన్ కోటా పునరుద్ధరణకు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. జూన్ లోగా సూపర్ సిక్స్‌లోని మరో మూడు హామీలు అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. 'తల్లికి వందనం' నిధులు విడుదల చేసి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. రైతులకు 'అన్నదాత సుఖీభవ', వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేలు ఇస్తామని చెప్పారు. పొలిట్ బ్యూరోలో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీపై చర్చించామని, ప్రతి హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

  • Loading...

More Telugu News