Team India: టీమిండియాదే సిరీస్... నాలుగో టీ20లో ఇంగ్లండ్ ఓటమి

- పుణేలో టీమిండియా × ఇంగ్లండ్
- మొదట 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసిన టీమిండియా
- ఛేజింగ్ లో 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
నాలుగో టీ20లో టీమిండియా స్ఫూర్తిదాయక విజయం సాధించింది. పుణేలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. తద్వారా 3-1తో సిరీస్ ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. శివమ్ దూబే 53, హార్దిక్ పాండ్యా 53 పరుగులతో రాణించారు. అనంతరం, 182 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ టీమ్ లో హ్యారీ బ్రూక్ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఓపెనర్లు బెన్ డకెట్ 39, ఫిల్ సాల్ట్ 23 రాణించారు. వారిద్దరూ తొలి వికెట్ కు 62 పరుగలు జోడించి శుభారంభం అందించినా, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ రాణించలేదు. కెప్టెన్ జోస్ బట్లర్ (2), లియామ్ లివింగ్ స్టన్ (9), జాకబ్ బెతెల్ (6) నిరాశపరిచారు. మిడిలార్డర్ లో హ్యారీ బ్రూక్ కు సహకారం అందించేవారు కరవయ్యారు. లోయరార్డర్ లో జేమీ ఒవెర్టన్ 19, అదిల్ రషీద్ 10 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3, యువ పేసర్ హర్షిత్ రాణా 3, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2, అర్షదీప్ సింగ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఇక, ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబయి వాంఖెడే స్టేడియంలో జరగనుంది.