Gannavaram TDP Office Attack: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు... సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు తీవ్ర నిరాశ

- గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి
- వల్లభనేని వంశీ అనుచరుల అరెస్ట్
- వంశీపైనా ఆరోపణలు
- ముందస్తు బెయిల్ కోసం నిందితుల ప్రయత్నాలు
- హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ కేసులో వైసీపీ నేతలు గతంలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కింది కోర్టుకు వెళ్లాలని ఆదేశిస్తూ, వారి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దాంతో, హైకోర్టు ఉత్తర్వులపై 33 మంది నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం... ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పినట్టే నిందితులు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
అయితే వైసీపీ నేతలకు కొద్ది మేరకు ఊరట కలిగిస్తూ... ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. రెండు వారాల వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు మెరిట్స్ లోకి తాము వెళ్లడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ వెల్లడించారు.
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. వంశీపైనా ఆరోపణలు ఉండడంతో ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.