Supreme Court: ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో స్పీకర్ చెప్పాలి: సుప్రీంకోర్టు

supreme court on brs mla padi koushik reddy petition

  • బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి పిటిషన్
  • ఎమ్మెల్యేలపై తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్న కౌశిక్ రెడ్డి న్యాయవాది
  • ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామన్న అసెంబ్లీ కార్యదర్శి న్యాయవాది
  • తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం అవసరమో స్పీకర్ తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో హైకోర్టు ఆదేశించినప్పటికీ స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం లేదన్నారు.

అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. నిర్ణయం తీసుకోవడానికి ఎమ్మెల్యేలకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు.

అయితే, ఇందుకు ఎంత సమయం కావాలో స్పీకర్‌ను సంప్రదించి తెలియజేయాలని ముకుల్ రోహత్గీకి జస్టిస్ బి.ఆర్. గవాయ్ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News