Uttar Pradesh: అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

- మీడియాతో మాట్లాడుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు
- ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా దక్కని ఊరట
కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సీతాపూర్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు.
బాధితురాలు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్‌లను కూడా పోలీసులకు సమర్పించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎంపీ రాకేశ్ రాథోడ్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో పోలీసులు ఎంపీని అరెస్టు చేశారు. అంతకుముందు ఇదే కేసులో ఎంపీ - ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.