Director Shankar: సినిమాల్లోకి వస్తానంటే తండ్రి ఓ షరతు పెట్టాడు.. డైరెక్టర్ శంకర్ కూతురు

- అవకాశాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన అదితి
- తన తండ్రి పేరుతో అవకాశాలు అడగబోనని వెల్లడి
- ఆడిషన్ కు వెళ్లి అందరితో పోటీ పడతానని వివరణ
తమిళ సినిమా 'విరుమన్' ద్వారా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి.. ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. తమిళ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న అదితి తన తాజా చిత్రం నేసిప్పాయ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా తెలుగులో 'ప్రేమిస్తావా' పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా అదితి మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లోకి తన ఎంట్రీ గురించి, అవకాశాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు 'విరుమన్', 'మావీరన్', 'నేసిప్పాయ' చిత్రాలలో అదితి నటించింది. ప్రస్తుతం 'వన్స్ మోర్' అనే చిత్రంలో నటిస్తోంది.
మెడిసిన్ పూర్తిచేశాక సినిమాల్లోకి వస్తానంటూ తండ్రి శంకర్ ను అడిగానని అదితి చెప్పింది. దీనికి తండ్రి తనకో షరతు విధించారని, ఆ షరతుకు ఒప్పుకుని సినిమాలు చేస్తున్నానని పేర్కొంది. సినిమాల్లోకి తన ఎంట్రీపై సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఓ నిర్ణీత గడువులోగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తికి అంకితం కావాలని తండ్రి చెప్పారని అదితి వివరించింది. సినిమాల్లో అవకాశాల కోసం తండ్రి పేరు ఉపయోగించుకోవడం తనకు ఇష్టంలేదని చెప్పింది. అందరిలాగే ఆడిషన్లకు వెళుతూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
ప్రముఖ దర్శకుడి కూతురు కావడం తనకు సంతోషమేనని అయితే ఆయన పేరుతో అవకాశాలు పొందడం తనకు ఇష్టంలేదని అదితి చెప్పింది. నటనపై ఆసక్తితోనే తప్ప డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదని స్పష్టం చేసింది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. తండ్రి శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందంటూ అదితి తన మనసులో మాట బయటపెట్టింది.
