Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు.. అనీమియా కావొచ్చంటున్న వైద్యులు

- నిద్రలేమి, అలసట వల్ల డార్క్ సర్కిల్స్ సహజమే
- ఐరన్ స్థాయులు తగ్గడం కూడా ఓ కారణమని వెల్లడి
- ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చని హెచ్చరిక
రాత్రిపూట నిద్రకు దూరమైతే కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) ఏర్పడటం సాధారణమే.. నిద్రించే వేళల్లో మార్పులు, పడకగదిలో సరైన ఏర్పాట్లు చేసుకుంటే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అయితే, కళ్ల కింద నల్లటి వలయాలకు నిద్రలేమి ఒక్కటే కారణం కాదని, అనీమియా కూడా కారణం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డార్క్ సర్కిల్స్ కు తోడు అలసట, ఓపిక లేకపోవడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా అనిపించడం వంటివి అనీమియా చిహ్నాలని చెబుతున్నారు. శరీరంలో ఐరన్ స్థాయులు తగ్గిపోవడం వల్ల ఎర్ర రక్త కణాల సామర్థ్యం తగ్గుతుందని, తగినంత ఆక్సిజన్ ను తీసుకెళ్లలేవని వివరించారు. ఈ పరిస్థితి అనీమియాకు దారితీస్తుందని తెలిపారు.
అనీమియా ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో ఇది ప్రాణాంతకం కూడా కావొచ్చని, క్యాన్సర్ కు కూడా దారితీయవచ్చని అన్నారు. బాధితులలో కనిపించే లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కొందరు బాధితులు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉంటుందని వివరించారు. కాగా, శరీరంలో ఐరన్ లెవల్స్ తగ్గిపోయినపుడు కళ్ల కింద నల్లటి వలయాలతో పాటు జుట్టు ఊడిపోవడం, గోళ్లు పెళుసుబారడం తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.
ఈ లక్షణాలు కనిపిస్తే అనీమియా కావొచ్చు..
అలసట, ఛాతి నొప్పి, శ్వాస పీల్చుకోవడం కష్టమవడం, కళ్లు తిరగడం, తరచుగా ఇన్ఫెక్షన్లు సోకుతుండడం, పదే పదే వేధించే తలనొప్పి, గుండె అదరడం.. వంటి లక్షణాలు కనిపిస్తే అనీమియా కావొచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.