inter public examinations: ఏపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు యథాతథం .. ఇంటర్ బోర్డు స్పష్టీకరణ

- తాజా ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించిన ప్రభుత్వం
- ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పబ్లిక్ పరీక్షలు
- ఫస్ట్ ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులు చదువుపై దృష్టి పెట్టరన్న వాదనలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రధమ సంవత్సరం విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనపై వివిధ వర్గాల నుండి విమర్శలు వ్యక్తం అయ్యాయి.
దీంతో ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షను యథావిథిగా నిర్వహించలని నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులు చదువుపై దృష్టి పెట్టరని, దీంతో అభ్యాసన సామర్థ్యాలు తగ్గిపోతాయని.. ఇలా పలు సూచనలు వచ్చాయి. దీంతో అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు విరమించుకోనుంది.
ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే గణితంలో ఏ, బీ పేపర్లు ఉండవు. రెండింటికి కలిపి ఒకే పేపర్‌గా ఇస్తారు. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపరు ఉంటుంది. రెండు భాషల సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్ట్‌ను విద్యార్ధులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు. త్వరలో ఇంటర్మీడియట్ విద్యామండలి వీటిపై సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనుంది.