Marriages: ముహూర్తాలు మోసుకొచ్చిన మాఘ మాసం.. రేపటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు!

- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెళ్లి సందడి
- నాలుగు నెలలపాటు వరుసగా ముహూర్తాలు
- మార్చి 18 నుంచి 28 వరకు వివాహాలకు సెలవు
- 25 రంగాలకు లభించనున్న ఉపాధి
పుష్యమాసం నిన్నటితో టాటా చెప్పేసి మాఘమాసానికి స్వాగతం పలికింది. అది వచ్చీ రావడంతోనే వివాహ ముహూర్తాలను తీసుకొచ్చింది. రేపటి నుంచి వరుసపెట్టి ముహూర్తాలు ఉండటంతో పెళ్లి సందడితో కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి. ఇన్ని రోజులపాటు శుభకార్యాలకు దూరంగా ఉన్న ఇళ్లలో సందడి వాతావరణం నెలకొననుంది. ఇక, పెళ్లిళ్లతోపాటే అనేక రంగాలు కూడా యాక్టివ్ అవుతున్నాయి. దాదాపు 25 రంగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నాయి. పురోహితుల నుంచి ఈవెంట్ ఆర్గనైజర్ల వరకు అందరూ బిజీగా మారిపోనున్నారు.
ఇప్పటికే బుక్ అయిన కల్యాణ మండపాల్లో పనులు మొదలు కానున్నాయి. రేపటి నుంచి మొదలయ్యే ముహూర్తాలు నాలుగు నెలలపాటు అంటే మే 23 వరకు ఉన్నాయి. అదే నెల 28న జ్యేష్టమాసం మొదలు కానుంది. అయితే మధ్యలో ఫాల్గుణ మాసంలో మార్చి 18 నుంచి 28 వరకు శుక్రమౌఢ్యమి కారణంగా ముహూర్తాలు లేవు. ఈసారి మాఘమాసంలో తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నట్టు ఇప్పటికే బుక్ అయిన కల్యాణ మండపాల రికార్డులను బట్టి తెలుస్తోంది.