guntakallu: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మందలించిన టీడీపీ హైకమాండ్

- పాత్రికేయులను బెదిరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
- జయరాం వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్
- జయరాం బెదిరింపులపై స్పందించిన టీడీపీ అధిష్ఠానం
మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన మీడియా ప్రతినిధులను హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. జయరాంకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి పాత్రికేయులను బెదిరించడం టీడీపీ సంస్కృతి కాదని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే జయరాం తన నియోజకవర్గంలో మీడియా ప్రతినిధులపై బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. తనపై, తన తమ్ముడిపై తప్పుడు వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయాలన్నారు. తన తప్పు ఉంటే సరిదిద్దుకుంటానని, తమ తప్పు లేకుండా వార్తలు రాస్తే తాట తీస్తానని, రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ప్రశ్నలు ఏమైనా ఉంటే తన ఎదుటే అడగాలని, తాను వెళ్లిన తర్వాత తప్పుగా రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జయరాం ఇలా బెదిరిస్తూ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పార్టీ అధిష్ఠానం స్పందించింది.
గుమ్మనూరు జయరాం 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గత వైసీపీ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్ఠానం ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాంను తప్పించి, ఆయన స్థానంలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా జడ్పీటీసీ విరూపాక్షిని నియమించింది.
జయరాంను కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న జయరాం 2024 మార్చి నెలలో టీడీపీలో చేరారు. జయరాం టీడీపీలో చేరిన కొద్దిసేపటికే వైసీపీ అధిష్ఠానం ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. టీడీపీ అధిష్ఠానం జయరాంకు గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఇవ్వగా, ఆ స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారు.