Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

- రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి 3వ స్థానం
- హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడి
ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ ప్రభుత్వ శకటానికి 3వ స్థానం లభించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 76వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఏపీ శకటం మూడవ స్థానం సాధించి పురస్కారానికి ఎంపిక కావడం ఆనందం కలిగించిందని తెలిపారు.
ఈ సంవత్సరం ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పంపించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నామని, అతిథులకు ఇచ్చే జ్ఞాపికల్లో వీటిని చేర్చడం జరిగిందని తెలిపారు.
ఏపీ శకటానికి 3వ స్థానం లభించిన సందర్భంగా... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు.