MS Dhoni: ధోనీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో చూశారా?... అభిమానిగా వెరీ హాట్ అంటున్న కెప్టెన్ కూల్!

- ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయి వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
- ధోనీతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమోను రూపొందించిన స్టార్ స్పోర్ట్స్
- తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసిన బ్రాడ్‌కాస్టర్
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయి వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయి వేదికగా జరగనున్నాయి. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో రూపొందించిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమోను బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇప్పుడీ ప్రోమో తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ప్రోమోలో కెప్టెన్ కూల్... ఐసీసీ టోర్నీలో ఉండే పోటీపై తనదైనశైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథిగా తాను ఎప్పుడూ కూల్‌గానే ఉన్నానని... కానీ ఇప్పుడు అభిమానిగా మ్యాచ్ లను వీక్షించబోతుండటం చాలా హాట్‌గా అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఆ హాట్ నుంచి బయటపడేందుకు డీఆర్ఎస్ (ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్)ను ఏర్పాటు చేసుకున్నా సరిపోవడం లేదని ఎంఎస్‌డీ చెప్పాడు.
"నేను కెప్టెన్‌గా ఛాంఫియన్స్ ట్రోఫీ ఆడా. మైదానంలో చాలా కూల్‌గానే నిర్ణయాలు తీసుకున్నా. కానీ, ఫ్యాన్‌గా ఈసారి ట్రోఫీని చూడబోతుండటం నన్ను కూల్‌గా ఉండనీయడం లేదు. టోర్నీలో పోటీని చూస్తుంటే ఈసారి మరింత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మన జట్టు బలంగా ఉన్నప్పటికీ, ఒక్క మ్యాచ్ ఓడినా... టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ టెన్షన్‌తో బయటే కాకుండా నాలోనూ టెంపరేచర్ పెరిగిపోతోంది" అని చెప్పడం ప్రోమోలో ఉంది.
ఈ వీడియోలో... ఐస్ గడ్డలతో తయారు చేసిన బట్టలు, టోపీని ధోనీ ధరించడం చూపించారు. చల్లగా ఉన్నప్పటికీ మ్యాచ్‌ల దెబ్బకు అవి సరిపోవడం లేదని ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ (డీఆర్ఎస్) కావాలని థర్డ్ అంపైర్‌ను ఎంఎస్‌డీ కోరడం వీడియోలో ఉంది. దాంతో ధోనీని పూర్తిగా ఐస్ గడ్డలతో ముంచేయడం చూపించారు. ఈ ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ నెట్టింట దూసుకెళుతోంది.
కాగా, 2013లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ ఐసీసీ టైటిల్‌ను దక్కించుకునేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.