Wings: మనుషులకూ రెక్కలు... ఇలా ఎగిరిపోవచ్చని తెలుసా?

- పక్షుల్లా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలనేది మనిషి చిరకాల వాంఛ
- రెక్కల తరహాలో ఎన్నో ప్రయోగాలు చేసినవారూ ఎందరో
- రెక్కలు ఎలా ఉంటే ఎగిరిపోవచ్చేనే దానిపై శాస్త్రవేత్తల అంచనాలివీ...
పక్షులను చూసినప్పుడల్లా మనమూ అలా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే ఎంతో బాగుంటుందని భావించని వారు ఉండరు. అలా కృత్రిమంగా రెక్కలు పెట్టుకునేందుకు ఒకప్పుడు ఎన్నో ప్రయోగాలు కూడా జరిగాయి. ఆ ఆశలతోనే ప్రయత్నాలు చేసి విమానాలను, హెలికాప్టర్లను రూపొందించుకోగలిగాం. మరి నిజంగా మనుషులు ఎగిరిపోవాలంటే... రెక్కలు ఎలా ఉండాలి, మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు అవసరమనే దానిపై శాస్త్రవేత్తలు తాజాగా పరిశీలన జరిపారు.
ఎంత పెద్ద రెక్కలు అవసరం?
మనుషులకు రెక్కల అంశంపై నార్త్ కరోలినా యూనివర్సిటీకి చెందిన బయాలజీ ప్రొఫెసర్ టై హెడ్రిక్ అధ్యయనం చేశారు. సుమారు ఐదు అడుగుల ఎత్తుతో 70 కిలోల బరువున్న మనిషి గాలిలో పక్షిలా ఎగరాలంటే.. కనీసం 20 అడుగుల వెడల్పున (6 మీటర్లు) రెక్కలు అవసరమని తేల్చారు. అంతేకాదు... కేవలం ఇలా రెక్కలు కట్టుకుని ఎగరడం సాధ్యం కాదని, దీనికోసం మన శరీరంలో ఎన్నో మార్పులూ అవసరం ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అదనంగా ఎముకలు అవసరం...
ప్రస్తుతం మనకు ఉన్న భుజాలతో రెక్కల ఏర్పాటు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు తేల్చారు. మన ఛాతీ ముందు భాగం నుంచి, వెనుకాల వీపు భాగం వరకు అనుసంధానం చేసేలా ప్రత్యేకమైన ‘షోల్డర్ బ్లేడ్’ ఎముకలు అవసరమని గుర్తించారు.
గబ్బిలాల తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు
మామూలు పక్షులకు ఉన్నట్టుగా ఈకలతో కూడిన రెక్కలు మనుషులకు పనికిరావని శాస్త్రవేత్తలు తేల్చారు. గబ్బిలాలకు ఉన్న తరహా రెక్కలు మనుషులకు బాగా సరిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో భుజం ఎముక నుంచే శరీరం బయటికి వెళ్లిపోయి.. చేతుల పొడవునా ప్రత్యేకమైన, మందపాటి చర్మం రెక్కల మాదిరిగా ఏర్పడుతుంది. అది ఎక్కువ బరువును తట్టుకోగలుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కండరాల్లోనూ మార్పులు రావాలి...
పక్షుల్లో ఉండే కండరాల్లో సుమారు 20 శాతం వరకు వాటి ఛాతీ, రెక్కల భాగంలోనే ఉంటాయి. అవి గాలిలో ఎగిరేందుకు అవసరమైన శక్తిని అవి అందిస్తాయి. గబ్బిలాలలో అయితే 30 శాతం కండరాలు ఈ ప్రాంతంలోనే ఉంటాయి. మనుషుల్లోనూ కనీసం 20 శాతం నుంచి 30 శాతం కండరాలు ఉదర భాగంలోనే ఉండాలని, మిగతా చోట్ల కండరాల బరువు తగ్గాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగైతేనే రెక్కలతో గాలిలో ఎగరడం కుదురుతుందని స్పష్టం చేస్తున్నారు.