Kumbha Mela: మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళా భక్తులకు కీలక సూచనలు

Mauni Amavasya suggestions for Kumbha Mela devotees

  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు
  • ఘాట్‌లకు నిర్దేశించిన మార్గాల్లోనే వెళ్లాలని సూచన
  • తొందరపాటు చర్యలు వద్దని హితవు

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో దాదాపు 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వరుస కడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 15 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సంక్రాంతి రోజున మూడున్నర కోట్ల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. మౌని అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావిస్తారు.

రేపు మౌని అమావాస్య సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులకు సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.

నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్‌లకు వెళ్లాలని, స్నానాల తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండవద్దని అన్నారు. పార్కింగ్ ప్రదేశాలు లేదా బస చేసే ప్రాంతాలకు భక్తులు తిరిగి చేరుకోవాలని తెలిపారు. బారికేడ్ల వద్ద, పాంటూన్ బ్రిడ్జిలపై నిదానంగా వెళ్లాలన్నారు. తొందరపాటు చర్యలతో ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు.

ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. సంగమం వద్ద ఉన్న అన్ని ఘాట్‌లు పవిత్రమైనవేనని, మొదట ఎక్కడకు చేరుకుంటే అక్కడే పుణ్యస్నానమాచరించాలన్నారు. సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని కోరారు.

రోడ్ల మీద గుంపులుగా నిల్చోవద్దని హితవు పలికారు. స్నానాల ప్రదేశాలు, ఆలయాల్లో దర్శనాలకు హడావుడిగా వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పోలీసులు, అధికారుల సాయం తీసుకోవాలని తెలిపారు. పోలీసులకు అన్ని విధాలుగా సహకరించాలని సూచనలు చేశారు.

  • Loading...

More Telugu News