Revanth Reddy: ప్రపంచస్థాయి ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. పాల్గొన్న చిరంజీవి
![CM Revanth Reddy Inaugurates World Class Park in Rangareddy District](https://imgd.ap7am.com/thumbnail/cr-20250128tn67989f2fa1e37.jpg)
- రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్
- ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏకంగా 150 ఎకరాల్లో ఈ పార్క్ ఏర్పాటు
- ఇందులో 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25వేల జాతుల మొక్కలు, చెట్లు, వృక్షాలు
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏకంగా 150 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల జాతుల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు.
రూ. 150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతం ఈ ఎక్స్‌పీరియం పార్క్. దీని కోసం రాందేవ్‌రావ్ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఏకంగా 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్‌ను రూపొందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... "ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించాం. పర్యాటక పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సాహిస్తాం. అటవీ ప్రాంతాల సందర్శన కోసం మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆలయాల దర్శనాల కోసం తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాం. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించలేదు" అని అన్నారు.