Infosys: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు

- మరో పదిహేడు మందిపైనా బెంగళూరులో కేసు నమోదు
- ఐఐఎస్ సీ బోర్డు ట్రస్టీగా కొనసాగుతున్న గోపాలకృష్ణన్
- 2014లో కులంపేరుతో దూషించారని ఐఐఎస్ సీ మాజీ ఉద్యోగి ఫిర్యాదు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఐఐఎస్ సీ బోర్డు ట్రస్టీగా కొనసాగుతున్న సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై బెంగళూరు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఐఐఎస్ సీ డైరెక్టర్ బలరాం సహా మొత్తం పద్దెనిమిది మందిపై సదాశివనగర్ పోలీసులు కేసు పెట్టారు. 2014లో తనను అన్యాయంగా హనీట్రాప్ కేసులో ఇరికించి ఉద్యోగంలో నుంచి తొలగించారంటూ ఐఐఎస్ సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు. దీనిపై 71 సిటీ సివిల్, సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ఐఐఎస్ సీలో ప్రొఫెసర్ గా పనిచేసిన దుర్గప్ప బోవి కమ్యూనిటీ (గిరిజన)కి చెందినవారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న సమయంలో తనను హనీట్రాప్ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. అనంతరం తనను కులం పేరుతో దూషించడంతో పాటు బెదిరింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. మొత్తం పద్దెనిమిది మందిపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అయితే, ఈ అంశంపై గోపాల కృష్ణన్ కానీ ఐఐఎస్ సీ బృందం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.