Vijayasai Reddy: ఆ ఒత్తిడి తెచ్చిన వాళ్లెవరో విజయసాయిరెడ్డే చెప్పాలి: అంబటి రాంబాబు

- రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి
- రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా
- తనను అప్రూవర్ గా మారాలని ఒత్తిడి చేశారని వెల్లడి
- ఈ కేసులో వాస్తవం లేదు కాబట్టే ఆయనను అప్రూవర్ మారాలని ఒత్తిడి చేశారన్న అంబటి
కొన్ని రోజుల కిందట రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డి... రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ... జగన్ అక్రమాస్తుల కేసులో తనను అప్రూవర్ గా మారాలని చాలా ఒత్తిడి చేశారని వెల్లడించారు. ఈ అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు.
"అప్రూవర్ గా మారమని విజయసాయిరెడ్డిపై చాలా ఒత్తిడి వచ్చిందన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. ఆ విషయం ఇప్పటివరకు మాకు తెలియదు. ఆయన మాకు ఎంతో సన్నిహితుడైనప్పటికీ ఆ విషయం ఎప్పుడూ మాతో చెప్పలేదు.
ఈ కేసులో వాస్తవం ఉంటే ఆయనను అప్రూవర్ గా మారమని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే... ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చి, ఆయనతో దొంగ సాక్ష్యం చెప్పించుకుని జగన్ మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు... ఎవరు వాళ్లు?... విజయసాయిరెడ్డి గారు చెప్పాలి. ఆ ఒత్తిడి చేసిన వాళ్లెవరో విజయసాయిరెడ్ది గారు చెబితే తప్ప తెలియదు.
ఈ కేసులో జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే, విజయసాయిని అప్రూవర్ గా మారాలని ఒత్తిడి చేసినట్టు అర్థమవుతోంది. ఆధారాలు లేకుండానే జగన్ మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారని అర్థమవుతోంది. ఆధారాలు లేకపోయినా, ఆయనపై రాజకీయ కక్ష సాధించడానికి ఇవన్నీ చేస్తున్నారని అర్థమవుతోంది.
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే కోరిక కన్నా, ఏదో ఒక విధంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా జగన్ మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేదే చంద్రబాబు ఉద్దేశం. ఎదుటి వాళ్లు నష్టపోతే తప్ప మనం బాగుపడలేం అని చంద్రబాబు భావిస్తున్నట్టుంది" అంటూ అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.