Devendra Fadnavis: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు... మరోసారి స్పందించిన ఫడ్నవీస్

- కేసు వివరాలను పోలీస్ కమిషనర్ వెల్లడిస్తారన్న ఫడ్నవీస్
- ఈ కేసులో ఎవరూ గందరగోళం సృష్టించవద్దని సూచన
- కేసు దర్యాఫ్తు కొనసాగుతోందన్న మహారాష్ట్ర సీఎం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ రోజు ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను ఈ రోజు కానీ, రేపు కానీ ముంబై నగర పోలీస్ కమిషనర్ మీడియాకు చెబుతారని తెలిపారు.
అప్పటి వరకు ఈ కేసు విషయంలో ఊహాగానాలు చేయవద్దని, పోలీసులు వెల్లడించని అంశాల ఆధారంగా ఎవరూ గందరగోళం సృష్టించవద్దని సూచించారు. కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఆశించినట్లుగా భారతీయ సాక్ష్యాధార వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని ఫడ్నవీస్ అన్నారు. మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఈ వాహనం ఏ ఘటన జరిగినా ఆ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తుందన్నారు. ఇప్పుడు ఆధారాలను ఎవరూ తారుమారు చేయలేరని వెల్లడించారు. ఈ వ్యాన్లను అన్ని పోలీస్ స్టేషన్‌లలో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.