Telangana: సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు

- 21 డిమాండ్లతో సమ్మె నోటీసు
- ఆర్టీసీ ప్రైవేటీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ నోటీసు
- డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు వెళతామని హెచ్చరిక
ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. 21 డిమాండ్లతో సమ్మె నోటీస్‌ను ఇచ్చారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లింపు తదితర డిమాండ్లు ఉన్నాయి.
సమ్మె నోటీసులు ఇవ్వడానికి కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున బస్ భవన్ తరలి వచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను మోహరించారు.
తమ డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాల నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో డిపోలను ప్రైవేటీకరణ దిశగా తీసుకు వెళుతున్నారని ఆరోపించారు. ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్లను రద్దు చేసి కార్మికుల పని గంటలను పెంచారని మండిపడ్డారు.