Railway Track: ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టి రైల్వే పట్టాలపై శవమై తేలిన యువకుడు.. అనంతపురంలో విషాదం

Young Man Dead body Found At Railway Track In Ananthapuram District

  • వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి వేధించారని కుటుంబ సభ్యుల ఆరోపణ
  • తన కొడుకును తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి బెదిరించారన్న తండ్రి
  • శనివారం రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదని ఆవేదన

గత ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని పేర్కొంటూ, ఫేసుబుక్ లో పోస్టులు పెట్టిన యువకుడు తాజాగా రైల్వే పట్టాలపై శవమై తేలాడు. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన కొడుకు చనిపోయాడని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి గ్రామంలో చోటుచేసుకుందీ ఘోరం. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టి.మహేశ్వరరెడ్డి (24) తన స్నేహితుడు మురళితో కలిసి ఈ నెల 25న సాయంత్రం సోములదొడ్డి గ్రామానికి వెళ్లాడు. గ్రామంలో తనకు కాస్త పని ఉందని, తాను ఫోన్ చేసినపుడు రమ్మని మురళిని పంపించాడు. దీంతో మురళి అనంతపురం వెళ్లాడు.

రాత్రి 10:30 ప్రాంతంలో మహేశ్వర్ రెడ్డి నుంచి మెసేజ్ రావడంతో మురళి సోములదొడ్డికి వెళ్లాడు. అయితే, మహేశ్వర్ రెడ్డి అక్కడ ఎక్కడా కనిపించలేదు. ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ రావడంతో మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులకు మురళి ఫోన్‌ చేసి చెప్పాడు. అందరూ అక్కడికి చేరుకుని వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం సోములదొడ్డి, నాగిరెడ్డి గ్రామాల మధ్య రైల్వే పట్టాల పక్కన మహేశ్వర్ రెడ్డి మృతదేహం కనిపించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. 

మాజీ ఎమ్మెల్యే వేధింపులే కారణం.. మృతుడి తండ్రి
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు రాజశేఖర్ రెడ్డి తన కొడుకును వేధించారని, తప్పుడు కేసులతో జైలుకు పంపారని మహేశ్వర్ రెడ్డి తండ్రి మల్లి రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడమే తమ నేరమని, తమపై కక్ష సాధింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో టీడీపీకి సహకరించామని తమ కుటుంబంపై కోపం పెంచుకున్నారని ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి ఈ నెల 1న పరిటాల శ్రీరామ్ ను కలిసి ఫేస్ బుక్ లో ఫొటో పెట్టాడని, అది చూసి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తన కొడుకును బెదిరించాడని చెప్పారు.

  • Loading...

More Telugu News