Jasprit Bumrah: ఛాంపియ‌న్స్ ట్రోఫీ ముందు భార‌త్‌కు షాక్‌.. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప టోర్నీలో బుమ్రా ఆడ‌డం క‌ష్ట‌మేన‌ట‌!

Miracle If Jasprit Bumrah Turns Up 100 Percent Fit BCCI Suffers Fresh Champions Trophy Setback

  • వెన్నునొప్పి గాయంతో బాధ‌ప‌డుతున్న టీమిండియా స్టార్ పేస‌ర్‌
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీ క‌ల్లా బుమ్రా 100 శాతం ఫిట్‌గా మారితే అది అద్భుతమే అంటున్న బీసీసీఐ వ‌ర్గాలు
  • బుమ్రాకు బ్యాక‌ప్‌ను రెడీ చేసే ప‌నిలో బీసీసీ ఉంద‌ని పేర్కొన్న 'టైమ్స్ ఆఫ్ ఇండియా' 

పాకిస్థాన్‌, దుబాయి వేదిక‌ల‌లో వ‌చ్చే నెల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత జ‌రుగుతున్న ఈ ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోవాల‌నుకుంటున్న భార‌త్ ఆశ‌ల‌పై నీళ్లుచ‌ల్లే వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ టోర్నీకి టీమిండియా స్టార్ పేస‌ర్‌ జస్ప్రీత్ బుమ్రా 100శాతం ఫిట్‌గా ఉండటం అనేది ఒక క‌ల అని, ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప అది సాధ్య‌ప‌డ‌ద‌ని తాజాగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' క‌థనం పేర్కొంది. 

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన ఆఖ‌రి టెస్టు నుంచి బుమ్రా వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ పేసర్ న్యూజిలాండ్‌లోని డాక్టర్ రోవాన్ స్కౌటెన్‌తో టచ్‌లో ఉన్నట్లు క‌థ‌నం తెలిపింది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చికిత్స కోసం కివీస్‌కి వెళ్లాల్సి ఉంద‌ని పేర్కొంది. దాంతో టోర్నమెంట్ స‌మ‌యానికి ఒక‌వేళ బుమ్రా 100 శాతం ఫిట్‌నెస్ సాధించ‌ని ప‌క్షంలో బీసీసీఐ అత‌నికి 'బ్యాకప్'ను సిద్ధం చేస్తోంద‌ని తెలిపింది.

ఇందులో భాగంగా బుమ్రాకు 'బ్యాకప్'గా హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్‌లను సిద్ధం చేయాలని సెలక్టర్లు చూస్తున్నార‌ట‌. "బీసీసీఐ వైద్య బృందం న్యూజిలాండ్‌లోని స్కౌటెన్‌తో టచ్‌లో ఉంది. బుమ్రా కోసం న్యూజిలాండ్‌కు వెళ్లాలని బోర్డు కూడా ప్లాన్ చేసింది. కానీ అది ఇంకా జరగలేదు. ఇచ్చిన టైమ్‌లైన్‌లో బుమ్రా 100 శాతం ఫిట్‌గా మారితే అది అద్భుతం అని సెలక్టర్లకు తెలుసు" అని బీసీసీఐ వ‌ర్గాలు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కి తెలిపాయి. 

కాగా,  2022 టీ20 ప్రపంచ కప్ స‌మ‌యంలో గాయం కావడంతో బుమ్రాకు డాక్టర్ స్కౌటెన్ శస్త్రచికిత్స చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు కూడా బుమ్రా గాయం తాలూకు రిపోర్టులు న్యూజిలాండ్‌లో ఉండే ఆయ‌న‌కు పంపించ‌డం జ‌రుగుతుంది. స్కౌటెన్ ఫీడ్‌బ్యాక్‌పై ఆధారపడి బుమ్రా చికిత్స కోసం న్యూజిలాండ్‌కు వెళ్లాలా? వ‌ద్దా? అనేది నిర్ణ‌యించ‌డం జ‌రుగుతుంద‌ని క‌థ‌నం పేర్కొంది. 

ఇక ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు వ‌న్డేల‌ సిరీస్ ఆడనుంది. దీనికోసం ఇప్ప‌టికే జట్టును ప్ర‌క‌టించింది. ఈ వన్డే జట్టులో హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఒకవే‌ళ బుమ్రా త్వరగా కోలుకోకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా రాణా ఎంపిక లాంఛ‌న‌మే అవుతుంది. 

  • Loading...

More Telugu News