Uttarakhand: నేటి నుండి ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

uniform civil code will be rolled out in uttarakhand from today

  • ఉత్తరాఖండ్ సీఎం పుష్కర ధామి యూసీసీపై కీలక ప్రకటన
  • యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సీఎం
  • ఈ చట్టం అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందన్న సీఎం

సుదీర్ఘ కసరత్తు అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలులోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిన్న కీలక ప్రకటన చేశారు. దేశంలోనే యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని ఆయన పేర్కొన్నారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చేశామన్నారు. 

తొలుత యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ప్రభుత్వం 2022 మే నెలలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల  కమిటీని నియమించింది. సుదీర్ఘమైన కసరత్తు అనంతరం కమిటీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా, గత ఏడాది ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదించింది. నెల రోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది.

తదుపరి యూసీసీ బిల్లు అమలు మార్గదర్శకాల కోసం మాజీ సీఎస్ శత్రుఘ్నసింగ్ సారధ్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. గత ఏడాది చివరిలో నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన ఉత్తరాఖండ్ కేబినెట్ యూసీసీ అమలుకు తేదీని ఖరారు చేసే అధికారాన్ని సీఎం ధామికి అప్పగిస్తూ తీర్మానం చేసింది. ఈ క్రమంలో సీఎం ధామి సోమవారం (జనవరి 27 నుంచి) యూసీసీ అమలులోకి వస్తుందని కీలక ప్రకటన చేశారు.  

  • Loading...

More Telugu News