Shikhar Dhawan: శిఖర్ ధవన్ యూ టర్న్.. ఈ టోర్నీతో మళ్లీ భారత జట్టులోకి!

- గతేడాది అంతర్జాత క్రికెట్‌కు ధవన్ గుడ్‌బై
- ఈ ఏడాది డబ్ల్యూసీఎల్ రెండో ఎడిషన్
- భారత్ తరపున ఆడేందుకు ధవన్ ఒప్పందం
- అతడి రాకతో జట్టు బలం పెరిగిందన్న జట్టు సహ యజమాని సుమంత్ బహల్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ యూటర్న్ తీసుకున్నాడు. ఈ ఏడాది జరిగే రెండో ఎడిషన్ ‘వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్)లో భారత జట్టు తరపున ఆడేందుకు సైన్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి గతేడాది వైదొలగిన 39 ఏళ్ల డ్యాషింగ్ బ్యాటర్ పలు రికార్డులను తన పేర రాసుకున్నాడు.
ధవన్ రికార్డులు ఇలా..
శిఖర్ ధవన్ తన కెరియర్‌లో మొత్తం 164 వన్డే మ్యాచ్‌లు ఆడి 44 సగటు, 91.35 స్ట్రైక్ రేట్‌తో 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలు, 39 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 143 పరుగులు. అలాగే, టెస్టుల్లో 58 ఇన్నింగ్స్‌లలో 40.61 సగటు, 67 స్ట్రైక్‌రేట్‌తో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 190 పరుగులు. ఇక, టీ20ల్లో 66 ఇన్నింగ్స్‌లలో 126.36 స్ట్రైక్‌రేట్‌తో 1,759 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 పరుగులు. ధవన్ ఐపీఎల్‌లో 221 ఇన్నింగ్స్ ఆడి 6,769 పరుగులు సాధించాడు. ఇందులో 51 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి.
ధవన్ రాకతో జట్టు బలోపేతం
డబ్ల్యూసీఎల్‌లో ధవన్ భారత జట్టుకు ఆడనుండటంపై భారత జట్టు సహ యజమాని సుమంత్ బహల్ ఆనందం వ్యక్తం చేశారు. ధవన్ రాకతో జట్టు మరింత బలోపేతమైందని అన్నారు. డబ్ల్యూసీఎల్ తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన తాము దానిని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామన్నారు. పాత ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతోపాటు కొత్త ఆటగాళ్లను తీసుకోవడం ద్వారా జట్టును మరింత ఉత్తమంగా, మరింత బలంగా తయారుచేస్తామని వివరించారు.
క్రికెట్‌ను కొనసాగించేందుకు ప్రేరణ: ధవన్
డబ్ల్యూసీఎల్ వ్యవస్థాపకుడు హర్షిత్ తోమర్ కూడా ధవన్ చేరికపై సంతోషం వ్యక్తం చేశారు. ధవన్ రాకతో లీగ్ ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ఈ టోర్నీ ద్వారా క్రికెట్ పునరుత్తేజం పొందుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకునేలా టోర్నీని నిర్వహిస్తామని చెప్పారు. ధవన్ మాట్లాడుతూ ఇలాంటి టోర్నీలు క్రికెట్ పట్ల తనకున్న ప్రేమను కొనసాగించేందుకు ప్రేరణను ఇస్తాయని పేర్కొన్నాడు.