Maharashtra: 13వ అంతస్తు నుంచి పడ్డ చిన్నారి.. సమయస్ఫూర్తితో పాప ప్రాణాలు కాపాడిన వ్యక్తి.. వైరల్ వీడియో!

- మహారాష్ట్రలోని థానేలో ఘటన
- 13వ అంతస్తులోని బాల్కనీలో ఆడుకుంటూ కిందపడిన రెండేళ్ల చిన్నారి
- పాప కిందపడుతుండటాన్ని గమనించిన భవేశ్ మాత్రే
- ఒక్క క్షణం ఆలస్యం చేకుండా చిన్నారిని క్యాచ్ పట్టిన వైనం
- దాంతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిన మాత్రే
మహారాష్ట్రలోని థానేలో జరిగిన షాకింగ్ ఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియనప్పటికీ, వీడియో చూస్తే మాత్రం ఒళ్లు జలదరించడం ఖాయం. ఇక వీడియో చూసిన నెటిజన్లు భూమి మీద నూకలు ఉండటం అంటే ఇదేనెమో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రెండేళ్ల చిన్నారి 13వ అంతస్తు నుంచి పడడం వీడియోలో ఉంది. అయితే, ఓ వ్యక్తి సమయస్ఫూర్తితో ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. దాంతో అంత ఎత్తు నుంచి కిందపడినా.. పాప స్వల్ప గాయాలతోనే బయటపడింది. థానే పరిధిలోని డోంబివలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా ఉండే ఓ అపార్ట్‌మెంట్ 13వ అంతస్తులోని బాల్కనీ వద్ద చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కిందపడుతుండటాన్ని భవేశ్ మాత్రే అనే వ్యక్తి గమనించాడు. దాంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కిందపడుతున్న పాపను పట్టుకునేందుకు పరిగెత్తాడు. చిన్నారిని పూర్తిగా పట్టుకోలేకపోయినప్పటికీ.. ఆమె నేరుగా నేలను తాకకుండా కొంతమేర ఆపగలిగాడు. దాంతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగాడు. దీంతో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది.
13వ అంతస్తులోని బాల్కనీలో ఆడుకుంటూ చిన్నారి పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. "బాల్కనీ అంచున కొంతసేపు ఆమె ప్రమాదకరంగా వేలాడుతూ, ఆపై పడిపోయింది" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
భవేశ్ మాత్రే మాట్లాడుతూ... "ఎలాగైనా చిన్నారి ప్రాణాలను కాపాడాలని నిశ్చయించుకున్నాను. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్లాను. ధైర్యం, మానవత్వాన్ని మించిన మతం ఏదీ లేదు" అని విలేకరులతో అన్నాడు. చాకచక్యంగా వ్యవహరించిన మాత్రేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే, పాపను కాపాడిన మాత్రేను ప్రభుత్వ అధికారి ఒకరు ప్రశంసిస్తూ, త్వరలోనే ఆయనను సన్మానిస్తామని పేర్కొన్నారు.