cm chandrababu: సీకే పల్లి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం .. హాస్టల్ వార్డెన్‌పై వేటు

cm chandrababu is serious about the ckpally incident

  • సీకే పల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
  • సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌తో ఫోన్‌‌లో మాట్లాడిన చంద్రబాబు
  • పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదన్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హాస్టల్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయని వార్డెన్, సంబంధిత ఉద్యోగుల తీరుపై సీఎం మండిపడ్డారు.

తనకు విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసినట్లు సీఎంకు కలెక్టర్ వివరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వార్డెన్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు మంత్రి సవిత కూడా ఈ అంశంపై స్పందించారు. కలెక్టర్, బీసీ సంక్షేమ శాఖాధికారులతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. హాస్టల్‌లో మధ్యాహ్న భోజనం ఎందుకు సమకూర్చలేదని మంత్రి ఆరా తీశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి సరికాదని మండిపడ్డారు. విద్యార్థులను ఆకలితో బాధపడేలా చేసిన సీకే పల్లి బీసీ బాలుర హాస్టల్ హెచ్‌డబ్ల్యూవో నారాయణ స్వామిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కలెక్టర్‌ను మంత్రి సవిత ఆదేశించారు.

మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు హాస్టల్ విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. అధికారులపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారని, వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి స్పష్టం చేశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, అవసరమైతే అటువంటి హెచ్‌డబ్ల్యూవోలను, ఇతర సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని మంత్రి సవిత హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 

  • Loading...

More Telugu News