Vijayashanthi: సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని పరిశీలించండి: పద్మ అవార్డ్స్‌పై విజయశాంతి

- గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- ఈ ఏడాది మొత్తం ఏడుగురు తెలుగువారిని వరించిన పద్మ అవార్డులు
- తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు
- అయితే, ఈ అవార్డుల్లో తెలంగాణకు కనీసం నాలుగైనా ప్రకటించాల్సిందన్న సీఎం రేవంత్
- రేవంత్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానన్న విజయశాంతి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణకు కనీసం నాలుగైనా ప్రకటించాల్సిందని సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ అభిప్రాయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిశీలిస్తే బాగుంటుందని ఆమె ట్వీట్ చేశారు.
"కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణకు కనీసం 4 పద్మ అవార్డులు అయినా వచ్చి ఉండాలి.. అనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం పరిశీలనాత్మకమైన అంశం. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ దీనిపై ఆలోచించడం మంచిది. సీఎం రేవంత్ అభిప్రాయాన్ని పరిశీలించాలని కోరుకుంటున్నా" అని విజయశాంతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక ఈ ఏడాది ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏడుగురు తెలుగువారిని ఈ పురస్కారాలు వరించాయి. ఇందులో తెలంగాణ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వైద్య విభాగంలో డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ వచ్చాయి. అటు ఏపీ నుంచి నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ సహా నలుగురు పద్మశ్రీకి ఎంపికయ్యారు.