Fire Accident: హుస్సేన్ సాగర్ లో అగ్నిప్రమాదం

- భారత మాతకు మహా హారతి కార్యక్రమంలో అపశ్రుతి
- బాణసంచా పేలడంతో పడవలకు మంటలు
- ముగ్గురికి గాయాలు
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా పేలడంతో రెండు పడవల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.
ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా భారత మాతకు మహా హారతి పేరిట హుస్సేన్ సాగర్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా... హుస్సేన్ సాగర్ మధ్యలో నీటి మీద బాణసంచాతో ఓ ప్రదర్శన నిర్వహించాలని భావించారు. రెండు బోట్లలో పెద్ద ఎత్తున బాణసంచా ఉంచి హుస్సేన్ సాగర్ మధ్యకు తరలించారు.
అయితే, బాణసంచా కాల్చే సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. రెండు పడవలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ సమయంలో పడవల్లో ఏడుగురు ఉన్నారు. రెండు పడవల్లో ఒక బోటు పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది.