Nandamuri Balakrishna: బాలకృష్ణ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

- బాలకృష్ణకు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు
- బాలయ్యపై అభినందనల వర్షం
- బాలకృష్ణను ఆయన నివాసంలో సత్కరించిన కిషన్ రెడ్డి
పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికైన టాలీవుడ్ కథానాయకుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై అభినందనల జడివాన కురుస్తోంది. హైదరాబాదులోని ఆయన నివాసం సందర్శకులతో రద్దీగా మారింది. ఈ ఉదయం నుంచి ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి స్వయంగా అభినందిస్తున్నారు.
తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని బాలకృష్ణ నివాసానికి వచ్చారు. ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయనను అభినందించారు. బాలయ్య తెలుగు చిత్రపరిశ్రమకు విశేష సేవలు అందించారని, అందుకే ఈ విశిష్ట పురస్కారం ఆయనను వరించిందని కిషన్ రెడ్డి కొనియాడారు. బాలకృష్ణ తిరుగులేని నటుడు అనే విషయం పక్కనబెడితే... ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను పద్మభూషణ్ అందుకునేందుకు మరింత అర్హుడని పేర్కొన్నారు.
కాగా, బాలయ్యను ఆయన నివాసంలో కిషన్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో కాసేపు చర్చించారు.



